వికారాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర మంతటా జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుతున్నారు. కాని వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో మాత్రం జాతీయ జెండాకు అవమానం జరిగింది. కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి జాతీయ జెండా ను తలకిందులుగా ఎగురవేశారు. అప్పటికే అక్కడికి స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చారు. ఇదే సమయంలో కొండల్ రెడ్డి జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. జాతీయ గీతాలపన ప్రారంభించిన సమయంలో కొందరు పైకి చూసి విషయాన్ని గుర్తించారు. దీంతో నాలుకర్చుకున్న కొండల్ రెడ్డి జాతీయ పతాకాన్ని తిరిగి మార్చారు. అనంతరం మరో సారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్ని గ్రంథాలు, స్వాతంత్య్ర చరిత్ర పుస్తకాలకు నిలయం గ్రంథాలయం అలాంటి గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గా విద్యార్థులు, యువకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే వ్యక్తి జాతీయ జెండాకు అవమానం కలిగించడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇదంతా జరిగిన ఎమ్మెల్యే నామ మాత్రంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.
మీ అభిప్రాయం తెలపండి